పాకిస్తాన్ లో ఎన్నికల ముందు వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి 25 మందికి పైగా ప్రాణాలను కోల్పోయినట్టు సమాచారం. 40 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుళ్లు జరిగాయి. పిషిన్, కిల్లా సైపుల్లా జిల్లాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. రేపు అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్నికలకు ఒక రోజు ముందు పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ లో బాంబు పేలుళ్లు కలకలం రేకెత్తిస్తున్నాయి. పిషిన్ నగరంలో స్వతంత్ర అభ్యర్థి అస్పంద్ యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వద్ద మొదటి పేలుడు సంభవించింది. ఆ తరువాత కిలా సైపుల్లా నగరంలో జమియాత్ ఉలేమా ఏ ఇష్లాం పార్టీ అభ్యర్థి మౌలానా అబ్దుల్ వాసే కార్యాలయంలో రెండో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో కలిపి దాదాపు 25 మంది మరణించినట్టు సమాచారం. 40 మంది వరకు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ సురక్షితంగా ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ పోస్టులు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి పాక్ ఎన్నికల సంఘం పోలీసుల నుంచి నివేదిక కోరింది.