బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డి గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతా రెడ్డి తెలిపారు. దిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
కాంగ్రెస్‌లో చేరడం మాత్రం ఖాయమని సువీతా రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి, సునీతా రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వారు బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఆ ఎన్నికల్లో తాండూరు బీఆర్ఎస్ టికెట్‌ను మహేందర్ రెడ్డి ఆశించగా.. అధిష్ఠానం రోహిత్ రెడ్డికి టికెట్ కేటాయించింది. మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.