ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్ ఇంటిపై పక్కా సమాచారంతో ఈడీ దాడి చేసింది. ఈ సోదాల్లో అధికారులు అతడి ఇంట్లో భారీ ఎత్తున కరెన్సీ నోట్ల బాక్సులు గుర్తించారు. దాదాపు రూ. 4.5 కోట్ల నగదు సీజ్ చేశారు. దాంతో పాటు మరో రూ.34 కోట్ల విలువైన నగలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సుశాంత్ పట్నాయక్ అటవీ భూముల కుంభకోణంలో నిందితుడిగా ఉన్నాడు. అతడు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బుధవారం రోజున కెనాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు చేపట్టిన తనిఖీలు గురువారం తెల్లవారుజాము వరకు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన ఇంట్లో ఏకంగా డబ్బు లెక్కించే యంత్రాలే ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. ఎన్వలప్ కవర్లలో కొంత నగదు ఉంచి, వాటిపై కొందరు ఐఎఫ్‌ఎస్, రేంజర్ స్థాయి అధికారుల పేర్లను రాసినట్లు గుర్తించినట్లు తెలిపారు. వారిని కూడా త్వరలో విచారిస్తామని వెల్లడించారు.