తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరోరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ఈరోజు సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో కోరం లేదంటూ బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోరం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
మరోవైపు కోరం లేకుండా సభ నిర్వహణ సరికాదని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. కోరం ఉండేలా చూడాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోరం పూర్తిస్థాయిలో ఉందని, మాజీ హరీష్ రావుకు పూర్తిస్థాయి ప్రొసీజర్ తెలిసినా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కోరం అంటే 12 మంది సభ్యులు ఉంటే చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోరం ఏర్పాటుపై సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ముందుగా ప్రకటించిన సమయానికే సభ ప్రారంభించాలని కోరారు. సభ నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, సభ నాలుగైదు నిమిషాలు ఆలస్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.