ఆకాశమే మీ లక్ష్యమైతే మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్‌తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బయో ఆసియా 2024ను రేవంత్ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ఫార్మారంగానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలను పటిష్ఠం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకురావడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ స్వాగతించారు. అందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారమని వెల్లడించారు.
మరోవైపు హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న 21వ బయో ఆసియా సదస్సులో జీవవైవిధ్య, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుపుతున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలపై ఈ సదస్సు నిర్ణయాలు తీసుకోనుంది. 21వ బయో ఆసియా సదస్సుకు మంచి స్పందన వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. జీవవైవిద్య రంగాల్లో అంతర్జాతీయ ఖ్యాతికి సదస్సు దోహదం చేస్తుందని తెలిపారు.