కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. అభయ హస్తం గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లను కూడా త్వరలో ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. మహిళలకు రూ.2,500 అందిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యల్లోనే రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారు. కానీ మేం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం, తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో రూ.5 కోట్లతో గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి పొంగులేటి బుధవారం రోజున శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా అమలుచేసి తీరతామని మంత్రి స్పష్టం చేశారు. ధరణిలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పారు.