తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశానికి ఎగిసింది. ఇక అప్పటి నుంచి అలాగే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ను వేగవంతం చేసిన హస్తం పార్టీ తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీల వారీగా నిర్వహించిన సర్వేల ఫలితాలను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిశీలించినట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేలలో దాదాపు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల శాతం పెరిగినట్లు తేల్చింది.ఇటీవల సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిఫారసు చేసిన ఆశావహుల జాబితాతో పాటు బయట నుంచి పార్టీలో చేరిన, చేరబోతున్న ముఖ్య నాయకుల గెలుపుపై సర్వేలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులకు చెందిన సర్వేలు నిర్వహించేందుకు వివరాలను సునీల్ కనుగోలుకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలన్న దిశలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.