రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో పర్యటించిన ఆయన అమీర్‌పేట్‌లో గృహ జ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్ రీడింగ్‌ను తీసి స్వయంగా జీరో బిల్లులను మహిళలకు అందజేశారు. ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలొద్దని ప్రతిపక్షాలకు సూచించారు.
ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. పేదలను ఆదుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని పథకాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేశామని చెప్పారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత ఏర్పడుతోందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.