ఈనెల 14 వ తేదీ, లేదంటే 15వ తేదీన ఎన్నికల కోడ్ వచ్చే ఛాన్స్ ఉందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఎన్నికల కోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఎన్నికల కోడ్ గురించి ఎప్పుడు కూడా అడగని సామాన్య ప్రజలు, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని, ఎందుకంటే ఈ దుర్మార్గుడి పాలనను భరించలేకపోతున్నామని, ఇంకెన్నాళ్ల పాటు భరించాలని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ వస్తే ధైర్యంగా బ్రతకగలమని, ఈ పోలీసు గొడవలు, వారి అకృత్యాలు ఉండవని ఆశిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెబితే, సజ్జల రామకృష్ణారెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారుకి చెబితే, రాజేంద్రనాథ్ రెడ్డి గారు రఘురామిరెడ్డి గారికి చెబితే, రఘురామి రెడ్డి గారు తిరుమలేశ్వర్ రెడ్డి గారికి చెబితే… తిరుమలేశ్వర్ రెడ్డి గారు తన సిబ్బందితో మాజీ మంత్రి నారాయణ గారి అల్లుడి ఇంటిపై, ఆయన ఆఫీసు సిబ్బంది ఇళ్లపై దాడులు చేయడం ఏమిటని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. అసలు నారాయణ గారి అల్లుడు ఇంటిపై, ఆయన సిబ్బంది ఇళ్లపై దాడులు చేయడానికి మీకేమిటి సంబంధమని నిలదీశారు.