సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న గీతాంజలి భుజాన బ్యాగు ఉండడం పలు అనుమానాలకు తావు ఇస్తోందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లేవారు ఎవరైనా భుజాన బ్యాగ్ వేసుకొని వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రమాదం వల్లనైనా, మరే ఇతర కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని, సోషల్ మీడియాలో కామెంట్లు సర్వసాధారణమని, సోషల్ మీడియా కామెంట్లు ఆధారంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది అమాయకత్వమేనని, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను ఎంజాయ్ చేయాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.
తనను పేటీఎం కూలీలు ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తారని, అంతమాత్రానికే తాను ఆత్మహత్య చేసుకుంటానా? అంటూ ప్రశ్నించారు. గీతాంజలి ఆత్మహత్య అనంతరం హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు, పోలీసులు రంగప్రవేశం చేసి సోషల్ మీడియాలో ఎవరెవరు కామెంట్లు చేశారోనని ఆరా తీస్తున్నారని, వైకాపా వాళ్లే గీతాంజలిని హత్య చేసి, ట్రోల్ చేస్తున్న వారి ఖాతాలో ఆ ఖర్చు రాసి ఉంటారని అన్నారు. ఎందుకంటే గతంలో వైకాపా ఎంపీ ఒకరు తనను అసభ్య పదజాలంతో దూషించారని, తాను కూడా అతనిపై తిరగబడి చేయి చేసుకొని ఉంటే తన ఖాతాలో అతని ఖర్చు రాసేయ్యాలన్నది వైకాపా నాయకత్వం ప్లాన్ అని అన్నారు. ఈ విషయం ముందే తెలిసి తాను జాగ్రత్త పడ్డానని, దానితో ఆ ఎంపీ బ్రతికి బయటపడగా, తాను జైలుకు వెళ్లే ప్రమాదం తప్పిందని రఘురామకృష్ణ రాజు వివరించారు.