వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో.. చల్లని జల్లులు ప్రజల మనస్సును కాస్త శాంతిపరిచాయి. ఓ ఉష్ణతాపం కొనసాగుతుంటే.. మరోపక్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండడంతో.. ప్రజలు పరవశించి పోతున్నారు.
ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుందన్నారు. మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌కు చేరువలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని. దాని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వివరించింది.