కాసేపట్లో కోర్టుకు కేజ్రీవాల్.. ఈడీ 10 రోజుల కస్టడీ కోరే అవకాశం!

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. గురువారం రాత్రి సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆయనను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ కేజ్రీవాల్‌ను లాకప్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాత్రంతా ఆయన సరిగా నిద్రపోలేదని, తెల్లవారుజామునే నిద్రలేచి అల్పాహారం, మందులు తీసుకున్నారని వెల్లడించారు.

ఈ ఉదయం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు కాసేపట్లో ఆయనను ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలో సీఎంను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరే అవకాశమున్నట్లు సమాచారం. ఇదే కేసులో గతవారం అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించేలా దర్యాప్తు సంస్థ కోర్టు అనుమతి కోరనుంది. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధమైన నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news