తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌… అభ్యర్థుల ఎంపికపై వడపోత..!

-

తెలంగాణలో ఎంపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు నిర్వహిస్తున్నాయి. ఒక పార్టీలో పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా ఉండగా.. మరో పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధినేతకు పెద్ద టాస్క్‌గా మారింది. ఇక ఇంకోపార్టీ అధిష్ఠానం ఢిల్లీ వేదికగా అభ్యర్థులపై చర్చ జరుపుతోంది. తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఏ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై వడపోత పోస్తున్నాయి. హోలీ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉందని సీఎం రేవంత్‌ వెల్లడించగా.. తెలంగాణలో రెండు స్థానాల ఎంపికై బీజేపీ నేతలు హస్తినకు బయలుదేరనున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే వ్యవహారంలో కేసీఆర్ జల్లెడ పడుతున్నారు. త్వరలో పూర్తి జాబితాను విడుదల చేసేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. మల్కాజిగిరిలో ఎంపీగా తన గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కేసీఆర్ పతనం 2019లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందన్నారు. 2019 ఎంపీ ఎన్నికల సమయంలో నాయకులు అమ్ముడు పోయినా.. కార్యకర్తలు కష్టపడి పని చేసి ఎంపీగా గెలిపించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. హోలీ పండుగలోపు ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉందన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలకు సూచించారు.

ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరగనుంది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్‌కు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై మాత్రం కమలం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానం టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం సైతం జరుగుతోంది. పార్టీ మార్పు అంశాన్ని నామా నాగేశ్వరరావు కూడా ఖండించలేదు. ఇంకోవైపు ఖమ్మం టిక్కెట్ ఆశించి.. బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్‌ను ఎవరికి ఫైనల్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అభ్యర్థుల ఎంపికపై గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. మెదక్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు కేసీఆర్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. పెండింగ్ స్థానాల అభ్యర్థుల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక గులాబీ బాస్‌కు తీవ్ర తలనొప్పిగా మారింది. నల్గొండ నుంచి బరిలో మొదట గుత్తా అమిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ పరిశీలించింది. అయితే, పోటీకి అమిత్ రెడ్డి నో చెప్పడంతో సైదిరెడ్డికి గులాబీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సైదిరెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో అభ్యర్థి కోసం తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం నల్గొండ సీటు కోసం కంచర్ల కృష్ణారెడ్డి, కడారు అంజయ్య యాదవ్ పేర్లు పరిశీలనలో ఉండగా.. కంచర్ల కృష్ణారెడ్డి వైపే బీఆర్ఎస్ అధినేత మొగ్గు చూపుతున్నారు.

భువనగిరి కోసం మొదట మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పేరును దాదాపు ఫైనల్ చేసింది బీఆర్ఎస్‌. అయితే ఫైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో మరో అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం భువనగిరి రేసులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ పోటీకి విముఖత చూపడంతో.. పద్మారావు, దాసోజు శ్రావణ్, రావుల శ్రీధర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. పద్మారావును పోటీకి ఒప్పిస్తున్నారు. మెదక్ అభ్యర్థిపై ఇంకా పీఠముడి వీడలేదు. మొదట మెదక్ కోసం ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ పరిశీలించారు. వెంకట్రామిరెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఒంటేరు ప్రతాపరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. నాలుగు ఐదు రోజుల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయడంతో పాటు.. మూడు పార్టీల ప్రచారాన్ని స్పీడుగా చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news