దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ, మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, మరికొందరితో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల అంశాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మరికాస్త సమయం కావాలని కోర్టుకు వివరించారు.
మరోవైపు ఇటీవలే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్న ఈడీ ఆయనతో కలిపి కవితను కూడా విచారించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను మరో ఐదు రోజుల కస్టడీ కోరింది. కోర్టులోకి వెళ్లేముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.