కాళేశ్వరం అవినీతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లో పెడుతుందని విమర్శించారు. ఇచ్చిన హామీలపైన రాష్ట్ర ప్రభుత్వం మాటలతోనే సమయం గడుపుతుందని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా విమర్శలు, ప్రెస్ మీట్లతోనే కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్స్‌ను, కాంట్రాక్టర్స్ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ డబ్బులను కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పంపిస్తోంది. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్‌లో తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజల నుంచి వారికి తెలియకుండానే టాక్స్ వసూలు చేస్తున్నారు. కవిత అరెస్టుతో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ అవాస్తవాలను ఖండిస్తున్నాను. దిల్లీ మద్యం కేసులో అక్రమాలను సాక్ష్యాలతో నిరూపిస్తా. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు.” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.