జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అంతకుముందు APR 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. రెండుసార్లు తేదీల్లో మార్పులు చేసింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.పేపర్ – 2 పరీక్ష ఏప్రిల్ 12 వ తేదీన నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) జరగనుండగా, పేపర్-2 పరీక్ష ఒకే షిఫ్టు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) జరుగుతుంది.విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను jeemain.nta.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి.