దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31వ తేదీ, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ స్పష్టం చేసింది.
కేవీల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేస్తారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇకపోతే, రెండు, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది.