సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు కలకలం రేపారు. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుక్మాలోని కెర్లపెడ పోలింగ్ బూత్ గోడలపై రాశారు. ‘ఈ పోలింగ్ బూత్‌లో ప్రజలెవరూ ఓటు వేయరు. నాయకులను ఎవరి కోసం ఎన్నుకోవాలి? నాయకులు ప్రజలను మోసం చేస్తారు’ అని రాసి ఉండటం కనిపించింది. బస్తర్ లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నక్సలైట్లు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.
ఇంతకుముందు లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని గ్రామాల్లో, రోడ్డు పక్కన నక్సలైట్లు విసిరిన కరపత్రాలు కనిపించేవి. కానీ ఈ సారి ఏకంగా పోలింగ్ బూత్‌కు చేరుకుని మరీ నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు. బస్తర్ ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం కావడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో బస్తర్ స్థానానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తోంది. కెర్లపెడ పోలింగ్ బూత్‌లో 791 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 446 మంది మహిళా, 345 మంది పురుష ఓటర్లు ఉన్నారు.