ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జోరందుకుంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి ఆమె చంద్రబాబు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు భువనేశ్వరి భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అంతకుముందు భువనేశ్వరి స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన ఆమె.. ఆ తర్వాత బాబూ నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెట్టుబడులకు రాష్ట్రానికి చాలా మంది ముందుకు వచ్చారని, ఇవాళ పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి వెళ్లిపోతున్నాయని అన్నారు. కులమతాలు వేరైనా తామంతా ఆంధ్రులమేనని భువనేశ్వరి పేర్కొన్నారు.