ఒక్క ఓటు కోసం ముగ్గురు మహిళలు సహా అధికారులు క్రూర మృగాలు సంచరించే దట్టమైన అడవిలో గంటల కొద్ది కాలినడకన ప్రయాణం చేశారు. ఎత్తైన కొండలు ఎక్కుతూ మారుమూల గ్రామంలో నివసించే 92 ఏళ్ల వృద్ధ ఓటరు వద్దకు చేరుకున్నారు. కేరళ ఇడుక్కి జిల్లాలోని ఎడమలక్కుడి అనే మారుమూల గ్రామంలో నివసించే శివలింగం అనే 92 ఏళ్ల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ అధికారులు పెద్ద సాహసం చేశారు.
వయసు మీదపడి మంచానికి పరిమితమైన శివలింగానికి ఓటు వేయాలనే సంకల్పం బలంగానే ఉండటంతో ఆయన ‘ఇంటి నుంచి ఓటు’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శివలింగం అభ్యర్థనకు ఎన్నికల యంత్రాంగం ఆమోదం తెలిపి మారుమూల గ్రామంలో ఉన్న ఆ ఓటరు కోసం ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది అధికారులతో కూడిన పోలింగ్ సిబ్బందిని నియమించింది. ఎన్నికల సామగ్రితో బుధవారం ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన సిబ్బంది, 18 కిలోమీటర్లు దట్టమైన కొండ ప్రాంతంలో ప్రయాణించి మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకుని ఆయనతో ఓటు వేయించారు. ఓటు వేసిన శివలింగం, భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి కన్నీటితో వీడ్కోలు పలికారు.