తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
మార్చి 10వ తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టి ఈనెల 10 వ తేదీన పూర్తి చేశారు. మార్కుల నమోదు పాటు ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. 2023 ఏడాదిలో మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించగా.. ఈసారి అంత కంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఈసీ ఫలితాల విడుదలకు అనుమతి ఇచ్చింది.