మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల తో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో పేర్కొనడం అవాస్తవం, ఆయన ప్రకటనను ఖండిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందించి స్థానిక ట్రాన్స్కో ఎస్సీ ని విచారణకు ఆదేశించగా ఆయన ప్రకటనలో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. కెసిఆర్ ప్రకటనకు స్పందించి స్థానిక అధికారులతో విచారణ చేయించి వాస్తవాలు నిర్ధారించుకున్నట్లు తెలిపారు.
శనివారం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది, కరెంటు కోత పై శ్రీనివాస్ గౌడ్ పరిసరాల్లోని ఇంటి యజమాలను మా సిబ్బంది విచారించగా ఎటువంటి కోతలు లేవని వారు నిర్ధారించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటి సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ లో నమోదు చేసిన రీడింగ్ లోను కరెంటు కోతలు జరగలేదని తేలినట్లు తెలిపారు. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా జరిగే విద్యుత్ సరఫరా డిజిటల్ మీటర్ల ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా వాటంతట అవే రీడింగ్ చేస్తాయని.. ఆ డిజిటల్ మీటర్లలోను శనివారం విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని రికార్డుల ద్వారా స్పష్టమైందని తెలిపారు. ప్రతిపక్షనేత కేసిఆర్ విద్యుత్ సరఫరా లో అంతరాయంపై ఎటువంటి నిర్ధారణ చేసుకోకుండా ప్రకటనలు చేయడం విచారకరమని డిప్యూటీ సీఎం తెలిపారు.