ఓవైపు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయం రణరంగంలా మారింది. ఎంతో మంది కీలక నేతలు బరిలో నిలిచారు. అయినా ఆ రెండు స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. అవే ఉత్తర్ ప్రదేశ్లోని అమేఠీ, రాయ్‌బరేలీ. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో ఎవర్ని నిలబెడతారో అని ఆసక్తి నెలకొంది. అయితే గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేడు తెర దించింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టకేలకు ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిషోరీ లాల్ శర్మ బరిలో దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదట అమేఠి నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలి నుంచి ప్రియాంకా గాంధీ పోటీలో నిలుస్తారని అంతా భావించారు. కానీ ప్రియాంకా తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో బరిలో నిలిచేదెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.