ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి నిరాకరించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రన్నింగ్ స్కీమ్స్ నిధుల విడుదలను కూడా ఈసీ అడ్డుకోవడంపై అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఫిర్యాదు వల్లే పథకాల అమలుకు ఈసీ అనుమతి నిరాకరించిదని వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పేదల పాలిట రాక్షసుడు అని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఈసీకి చంద్రబాబు లేఖలు రాయించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చరిత్రలో ప్రజలు క్షమించరని ధ్వజమెత్తారు.