ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై రాజధాని ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెంకటాయపాలెంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రైతుల ఆందోళన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అలాగే ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దని అన్నారు.
పరిపాలన ఒక వద్ద నుండి సాగితేనే అభివృద్ది జరుగుతుందని.. లేదంటే ప్రజలంతా ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్… ఏపీలోకి ఆ దేశ సంస్కృతిని తీసుకొస్తారా? అని ఈ సందర్భంగా రైతులు ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఏటా తుపానులతో విశాఖపట్నం ఎంతో నష్టపోతోందని అన్నారు. ఒక్క రాజధాని నిర్మాణానికే దిక్కులేకపోతే… మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.