భూముల మార్కెట్ విలువలు సవరించండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

-

తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని.. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ప్రధాన విభాగాలైన వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనుల శాఖల అధికారులతో సచివాలయంలో సీఎం గురువారం రోజున సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలోనే రేవంత్ మాట్లాడుతూ..  హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల రేట్లు భారీగా పెరిగినా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా ఆదాయం మాత్రం దానికి అనుగుణంగా ఎందుకు పెరగడం లేదనే చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడమే ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తమైంది.

2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచినా, ఇంకా చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని సమావేశంలో చర్చించారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి సవరించాలి కాబట్టి, దానికి అనుగుణంగా భూముల మార్కెట్ విలువ మార్చేందుకు చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news