రెండేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితురాలికి ప్రాణభయం ఉంటే ఆమెకు రక్షణ కల్పించాలని, బాధితురాలు, ఆమె కుటుంబం ఉండడానికి సురక్షితమైన నివాసం ఏర్పాటు చేయాలని సీబీఐని తీస్ హజారీ కోర్టు ఆదేశించింది.
కాగా, 2017లో ఉద్యోగం కోసం వెళ్లిన బాలికను కుల్దీప్ సెంగార్ తన కామవాంఛలకు బలిచేశాడు. అయితే ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. సెంగార్ పై కేసులు నమోదు చేయకపోగా బాధితురాలి తండ్రిపై అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడంటూ కేసు నమోదు చేశారు. బాధితురాలు సీఎం నివాసం ముందు న్యాయం కావాలంటూ ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఈ ఘటన తర్వాత ఆమె తండ్రి పోలీసు కస్టడీలోనే ప్రాణాలు వదిలాడు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కుల్దీప్ సెంగార్ ను అరెస్ట్ చేశారు. మొత్తమ్మీద ఇన్నాళ్లకు బాధితురాలికి న్యాయం జరిగింది.