Southwest Monsoon hits Kerala: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేరళలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రెండు రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. విశాఖలో బుధవారం ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటడంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో అక్కడి ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు.