తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో తిరుమల ఆలయం రద్దీగా మారింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం రోజున శ్రీవారిని 75,068 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఇవాళ శ్రీవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు.