కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందినవారేనని అధికారులు తెలిపారు. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందిన వారున్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని సమాచారం. మిగిలిన మృతుల్లో పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, నేపాల్ జాతీయులున్నట్లు తెలిసింది.
కార్మికులంతా నిద్రలో ఉండగా వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం అంతా వ్యాపించడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నంబర్‌ను ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు +965 65505246 నంబరును సంప్రదించవచ్చు.