ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు.
అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన చంద్రబాబు.. తొలుత ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయుని పాలెం బయల్దేరారు. అక్కడ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించిన అనంతరం ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్తారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడనున్నారు.