శంషాబాద్‌లో ఆరోగ్య హబ్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-

ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ 500-1000 ఎకరాలు సేకరించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రపంచంలో పేరు గాంచిన వైద్య సంస్థలన్నీ నెలకొల్పేలా చూస్తామని వెల్లడించారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు.

విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన సంస్థ 24వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆలోచనతో చంద్రబాబు సహకారంతో 24 వసంతాలు పూర్తి చేసుకొని… లక్షల మందికి సేవలందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సంస్థకు సంబంధించిన లీజు, భవనాల అనుమతుల విషయమై ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే క్యాబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news