ఏపీలో 20.19 లక్షల పాస్‌ పుస్తకాలు వెనక్కి.. రాజముద్రతో మళ్లీ పంపిణీ

-

ఏపీలో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చర్చించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 20.19 లక్షల భూహక్కు పత్రాలను అందజేశారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారని వెల్లడించారు. సుమారు లక్ష వరకు భూహక్కు పత్రాలను పంచాల్సి ఉందని.. వీటిని నిలిపివేయనున్నట్లు చెప్పారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతోపాటు కొత్తవి ఎలా ముద్రించాలి? ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news