కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ‘జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’ అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ముద్ర వేసుకున్నారంటూ జైరాం రమేశ్ ‘ఎక్స్’లో చేసిన పోస్టుపై లోకేశ్ ఈ విధంగా స్పందించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన నారా లోకేశ్.. ‘‘అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంఘం గురించి స్పష్టంగా వివరించారు. ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు, షేర్ చేసిన ఫొటోలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మీరు వ్యక్తపరిచినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.