భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులకు ఆ మట్టే మరణశాసనం రాసిన పెను విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు.
మరణించిన వారిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం రోజున సత్సంగ్ చివరి రోజు కావడంతో ఆయన్ను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఊపిరాడక, ఒకరిపై ఒకరు పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.