తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి , హైదరబాద్ జిల్లాలకు అవకాశం కల్పించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిలతో చర్చించిన తర్వాత ఏఐసీసీ తుది నిర్ణయo తీసుకుంటుందని పీసీసీ వర్గాలు తెలిపాయి.
నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేర్లపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఏఐసీసీ సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. నాలుగు మంత్రి పదవులు వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ఏఐసీసీ, పీసీసీలు చేస్తున్న కసరత్తు తుది అంకానికి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.