కనకదుర్గమ్మతల్లి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి ఆలయంలో మాజీ ఈఓ భ్రమరాంబ చేతివాటం ప్రదర్శించినట్లు ఆడిట్ లో తేలింది. అమ్మవారికి అలంకరించిన పట్టుచీరలను వేలం వేయగా.. అందులో రూ.2 కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చింది ఆడిట్ టీమ్. 2021-23 సంవత్సరాల మధ్య వేలం వేసిన పట్టుచీరలకు రూ.2 కోట్లు నష్టం వచ్చినట్లు ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. పట్టుచీరల వేలం, బార్ కోడ్ ట్యాగింగ్ లో అవకతవకలు జరిగినట్టు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా మాజీ ఈఓ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో మాజీ ఈఓ నుంచి రూ.2 కోట్లను రికవరీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
భక్తులు అమ్మవారికి సమర్పించిన విలువైన పట్టుచీరల సేకరణ, వేలం నిర్వహణలో ఆడిట్ అభ్యంతరాలు వెలువడ్డాయి. చీరల వేలంతో ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. కొందరు ఆలయ అధికారులు ఆ కాంట్రాక్టును రూ.3 కోట్లకే కేటాయించడంపై ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ దాకలు చేవారు. దానిపై ఆడిట్ విభాగం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. చీరల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల్ని కంప్యూటర్ లో నమోదు చేయడంలోనూ అవకతవకలు జరుగుతున్నట్టు సమాచారం.