వీధి కుక్కను చంపినందుకు ప్రతీకారం.. ముగ్గురిని కత్తితో పొడిచిన ఐఐటీ విద్యార్థి

-

వీధి కుక్కను చంపిన వారిపై ఐఐటీయన్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. స్నేహితురాలి ద్వారా ఈ విషయం తెలిసి సొంతూరుకు చేరుకున్నాడు. ఆమె పొరుగింటికి చెందిన ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు.  తీవ్రంగా గాయపడిన కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. సోనార్‌పూర్‌లోని చౌహతి ప్రాంతంలో దేబ్‌నాథ్, గోబిందో అధికారి కుటుంబాలు నివసిస్తున్నాయి. దేబ్‌నాథ్‌ కుటుంబం వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై గోబిందో కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు తమ ఇంట్లోకి వస్తున్నాయని ఆరోపించడంతో ఈ రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వివాదం నెలకొన్నది.

మే నెలలో గోబిందో అధికారి కుటుంబం ఒక వీధి కుక్కను కొట్టగా కొన్ని రోజుల తర్వాత అది మరణించింది. దేబ్‌నాథ్‌ కుటుంబానికి చెందిన స్మృతి దేబ్‌నాథ్ దీనిపై తీవ్ర కలత చెందింది. ఐఐటీ మద్రాస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న స్నేహితుడైన అర్చన్ భట్టాచార్యకు ఈ విషయం చెప్పింది. మరోవైపు వీధి కుక్కను చంపడంతోపాటు స్నేహితురాలి కుటుంబాన్ని వేధిస్తున్న ఆమె పొరుగింటి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని అర్చన్‌ భావించాడు. వెంటనే చెన్నై నుంచి కోల్‌కతా చేరుకున్నాడు. గోబిందో అధికారి, అతడి భార్య, కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అర్చన్‌ను శనివారం అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news