తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలు తెలంగాణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. విద్యాశాఖ నిర్వర్తిస్తున్న మీరు, రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పా.. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన ఏడునెలల సమయంలో కొత్తగా చేసిందేమీ లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సన్నబియ్యానికి బదులు ముక్కిన బియ్యంతో భోజనం పెడుతున్నారని.. విద్యార్థుల పౌష్టికాహారం కోసం అందించే కోడి గుడ్ల బిల్లులు సైతం చెల్లించని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా ఒకే జత బట్టలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.