Gruha Jyoti Scheme: గృహజ్యోతి వినియోగదారులకు మరో ఛాన్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గృహ జ్యోతి పధకం కింద అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నది. ఈ పధకంలో భాగంగా ప్రజా పాలన కార్యక్రమంలో వినియోగదారులు అందజేసిన USC (విద్యుత్ కనెక్షన్) నెంబర్ కు ఈ పధకాన్ని వర్తింపజేసి జీరో బిల్లులు అందిస్తున్నది.
అయితే ఈ పధక లబ్దిదారులు ఇల్లు మారినపుడు, ఆహారభద్రత కార్డు మరియు సర్వీస్ కనెక్షన్ అనుసంధానం లోపాల వల్ల గృహజ్యోతి పధక లబ్దిని పొందలేకపోతున్నారు. ఈ విషయంపై పలు వర్గాల నుండి అందుతున్న అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, ప్రజా పాలన సేవ కేంద్రాల్లో USC (విద్యుత్ కనెక్షన్) నెంబర్ ను సరి చేసుకోవటానికి వెసులు బాటు కల్పించింది. ఈ సందర్భముగా నల్గొండ జిల్లా పర్యటనలో వున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ నల్గొండ రూరల్ మండల ప్రజాపరిషద్ కార్యాలయంలో వున్న ప్రజా సేవా కేంద్రాన్ని సందర్శించి గృహ జ్యోతి పధకం లబ్దిదారుల నమోదు విధానాన్ని పరిశీలించారు.