అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రోజుకో నాటకీయ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ పై విమర్శలు వస్తుండగా తాజాగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం పైనా విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనంతగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని అమెరికా ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ట్రంప్ కంటే బైడెన్‌పై ఈ వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. భారత సంతతి అమెరికన్లలోనూ బైడెన్‌పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాన్ని సరిగా నడిపేవారు కావాలని, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని అమెరికన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతమున్న ఇద్దరు అభ్యర్థులూ వైదొలిగితే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
రాజకీయంగా పోటాపోటీగా ఉండే మిషిగన్, పెన్సిల్వేనియా, నెవడా రాష్ట్రాల్లో బైడెన్‌పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. డెమోక్రాట్లు తప్పనిసరై బైడెన్‌కే ఓటేస్తామని చెబుతున్నా.. అభ్యర్థిపై నిరాసక్తత కారణంగా చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ట్రంప్ వస్తే ఇబ్బందేనని చాలా మంది డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు.