గుజరాత్ అగ్రికల్చర్‌ వర్సిటీ ల్యాబ్‌లోకి ప్రవేశించిన చిరుత పిల్ల..!

-

అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు, జంతువులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ యూనివర్సిటీ లోకి ఓ చిరుత పిల్ల  ప్రవేశించి భయాందోళన సృష్టించింది.  జునాగఢ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ లోకి శుక్రవారం ఓ చిరుత పిల్ల ప్రవేశించింది. ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన బయో ఎనర్జీ లేబొరేటరీలోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న విద్యార్థులు చిరుతను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీసి ల్యాబ్‌ తలుపులు మూసేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు చిరుత పిల్లను బోనులో బంధించారు. ‘వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి చిరుతపులి ప్రవేశించినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని చిరుతను బోనులో బంధించాము’ అని రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అరవింద్‌ భలియా తెలిపారు. బంధించిన చిరుతను జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్‌ జూలో వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు. చిరుత ల్యాబ్‌లో తిరుగుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news