తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఏపీలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని… అక్కడకక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు ఆదివారం రోజున కురిసిన భారీ వర్షానికి అల్లూరి జిల్లా పాడేరు కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి గెడ్డ పొంగి ప్రవహించింది. పైనుంచి కురుస్తున్న వర్షాలకు కొండల మధ్య భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఇక ఇవాళ ఉదయం నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తుండటంతో పనిమీద బయటకు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.