తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ఒక్క కాంగ్రెస్ పార్టీకే రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ను ఎదుర్కొలేక కేసీఆర్ కోర్టులకు వెళ్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహబుబ్ నగర్ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ పాలమూరు జిల్లాపై పెట్టిలేదని అన్నారు.దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. మేం నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే బీఆర్ఎస్ వాళ్ల జీవితాలతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు.
తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, జీరో బిల్లులతో ప్రతి పేదవాడికి కరెంట్ బిల్లులు లేకుండా చేస్తున్నామని వివరించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచే ప్రతి పేదవాడికి రూ. 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన తెలిపారు.