అమెరికా అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించిన జోబైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రకటించడం డెమోక్రాట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటివరకు చప్పగా సాగుతున్న డెమోక్రాట్ల చందాల కార్యక్రమం ఒక్కసారిగా ఊపందుకుంది. కమలా బృందం కూడా వెంటనే ప్రచార చందాల కోసం సానుభూతిపరులకు మెయిల్స్ పంపడం షురూ చేసింది.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కోసం విరాళాలు వసూలుచేసే యాక్ట్‌బ్లూ సంస్థ క్షేత్రస్థాయి మద్దతుదారుల నుంచి గంటల్లోనే 46.7 మిలియన్ డాలర్లను సమీకరించినట్లు తెలిపింది. 2024 ఎన్నికల విరాళాల సేకరణలో ఈ ఒక్కరోజే అత్యధికం అని పేర్కొంది. కమలా పేరు ప్రకటించిన కొన్ని గంటల్లోనే చిన్న మొత్తాల్లో వచ్చిన విరాళాలే 27.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇక కమలా హారిస్‌కు, బైడెన్ ప్రచార బృందానికి దాదాపు 95.9 మిలియన్ డాలర్ల నిధులు దక్కే అవకాశం ఉంది. జూన్ చివరినాటికి బైడెన్ ఎన్నికల ఖర్చుల కోసం 240 మిలియన్ డాలర్లను సమీకరించారు. అయితే బైడెన్ ప్రచార నిధికి నామినీగా కమలా హారిస్ ఉండటంతో ఆ నిధులు ఆమె ప్రచార బృందం చేతికి రానున్నాయి.