ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ‘చెత్త’ యుద్ధం మరింత ముదిరింది. ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియాలో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈసారి రోడ్లపైన కాదు ఏకంగా అధ్యక్ష కార్యాలయం ప్రాంగణంలో ఈ ట్రాష్ బెలూన్స్ పడ్డాయి. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సంస్థ తెలిపింది. ఈరోజు ఉదయం ఉత్తర కొరియా, బెలూన్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్కు ఉత్తరంగా ఎగిరాయని.. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ ‘చెత్త’ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా పేర్కొంది.
మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం రెండు దేశాల మధ్య సాగుతున్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది పదో సారి. ఇప్పటి వరకు 2,000 కంటె ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అయితే దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని ఉత్తర కొరియా పేర్కొంది.