అసెంబ్లీకి వెళ్లనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు జగన్.. రాజీనామా చేయండి : వైఎస్ షర్మిల

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎక్స్ వేదిగా ఆమె ఘాటు ట్వీట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి, కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం.’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

“ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని… రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని… నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే… తాపీగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది.” అంటూ విరుచుకుపడ్డారు.

 

గత పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? అంటూ జగన్ను షర్మిల నిలదీశారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి పోనని చెప్పే జగన్.. ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారంటూ.. వెంటనే రాజీనామా చేయండి అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news