హైదరాబాద్‌లో లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులంతా అమ్మవారి ఆలయాలకు పోటెత్తుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో ఇవాళ నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు బోనాల ఉత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి నెలకొంది.
లాల్‌దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ ఉత్సవాలు జరుగుతున్నాయి.. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంబర్‌పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు రైతులంతా సమృద్ధిగా పంటలు పండించాలని, వారికి కాలం కలిసి రావాలని మొక్కుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. బోనాల సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అలాగే వైన్ షాపులు కూడా బంద్ ప్రకటించారు.