ఇక పూర్తిస్థాయి రాజ‌కీయ‌నేత‌గా పీకే

-

ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ పూర్తిస్థాయి పొలిటీషియ‌న్‌గా మారబోతున్నారు. పీకేగా పేరుగాంచిన ఆయ‌న సొంత రాష్ట్రం బీహార్‌. చాలాకాలం నుంచి రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. 2014లో బీజేపీకి అంత‌కుముందు వెస్ట్‌బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీకి, 2019లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి పీకే వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎన్నిక‌ల్లో ఆయా పార్టీలు స‌త్తా చాట‌డంతో పీకే ప్ర‌భ దేశ‌వ్యాప్తంగా వెలిగిపోయింది.

తిరుగులేని రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఆయ‌న కీర్తిప్ర‌తిష్ట‌ల‌ను తెచ్చుకున్నారు. ఈసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆయ‌న ఏ రాజ‌కీయ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేయ‌క‌పోయినా త‌న వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయంగా ఆస‌క్తిని రేకెత్తించారు. బీజేపీకి 400 సీట్లు రాక‌పోయినా ప్ర‌భుత్వ ఏర్పాటుకి అవ‌స‌ర‌మైన సీట్లు మాత్రం సాధిస్తుంద‌ని చెప్ని పీకే సంచ‌ల‌నం రేపారు. ఇలా ఆయ‌న ప్ర‌తిఒక్క‌రికీ బాగా గుర్తుండిపోయాడు.

కొన్ని రోజుల నుంచి వ్యూహ‌క‌ర్త‌గా ఎవ్వ‌రికీ ప‌నిచేయ‌ని ఆయ‌న త్వ‌ర‌లోనే ఒక రాజ‌కీయ పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం చాలా రోజుల నుంచి న‌డుస్తోంది. ఇటీవ‌లే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. దాదాపు రెండు నెల‌లు గ‌డిచిన టైమ్‌లో ఇప్పుడు త‌న రాజ‌కీయ పార్టీ పేరును ప్ర‌క‌టించారు ప్ర‌శాంత్‌కిశోర్‌. ప్రస్తుతం తాను నడుపుతున్న జన్ సురాజ్ అనే సామాజిక సంస్థ పేరునే కొత్త పార్టీకి మారుస్తూ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు పీకే. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జన్ సురాజ్ ని రాజకీయ పార్టీగా మారుస్తూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆయ‌న తెలిపారు. ప్ర‌శాంత్‌కిషోర్ కొత్త రాజ‌కీయ పార్టీపై దేశంలో అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఇన్నాళ్ళు తెర‌వెనుక నుంచి రాజ‌కీయాలు న‌డిపిన ఆయ‌న ఇప్పుడు తెర‌ముందు ఒక పార్టీని ఏ విధంగా న‌డిపించ‌బోతున్నార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

రాజకీయ వ్యూహకర్తగా, ఐ పాక్ వ్యవస్థాపకుడిగా దేశంలో ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిన వ్య‌క్తి ప్రశాంత్ కిశోర్. ఇప్పుడు ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు. ఆయ‌న సొంత రాష్ర్టం బీహార్ లో 2025 నవంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలే టార్గెట్‌గా ఆయ‌న వ్యూహాలు ర‌చిస్తున్నారు. అధికార జేడీయూ బీజేపీ కూటమిని ఢీ కొట్టడానికి జన్ సురాజ్ పార్టీ ద్వారా సిద్ధం అవుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న నితీష్ ని గద్దె దించుతామని చెబుతున్న పీకే., ఇండియా కూటమిలో చేర‌తారా అనే సందేహాలు వ్య‌క్త‌మువుతున్నాయి. పీకే సొంతంగా పోటీ చేస్తారా లేక కూటమితో చేతులు కలుపుతారా అనేది అత్యంత ఆస‌క్తిగా మారింది. ఒక రాజ‌కీయ పార్టీ త‌ర‌పున వ్యూహాలు ర‌చించ‌డం వేరు, ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాలు చేయ‌డం వేరు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ప్ర‌శాంత్‌కిశోర్ ఏ మేర‌కు రాణిస్తారో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news