తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారికి కానుకలు సమర్పిస్తారు. ఈ కానుకల్లో డబ్బు, బంగారం, వెండి, మొబైల్ ఫోన్లు, వాచీలు వంటివి ఉంటాయి. వీటని భక్తులు హుండీలో వేస్తారు. ఇలా భక్తులు సమర్పించిన కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేస్తూ ఉంటుంది. తాజాగా ఈనెల 12, 13వ తేదీల్లో ఈ వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల్లో మొబైల్ ఫోన్లు, వాచీల వంటిని ప్రతి నెల వేలం వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల కూడా వేలం వేయనున్నారు. కానుకలను.. ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బ తిన్న అనే రెండు కేటగిరీలుగా విభజించి వేలం వేస్తారు. ఇక ఈ కానుకల్లో వివిధ రకాల కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లు, వాచీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు.. ఇతర వివరాలు తెలుసుకునేందుకు తిరుపతిలోని హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్/ఏఈఓ ను సంప్రదించాలని వెల్లడించారు.